Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 43

Bhagiratha brings Ganga to earth !

దేవ దేవే గతే తస్మిన్ సోంగుష్ఠాగ్రనిపీడితామ్ |
కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత ||

తా|| 'ఓ రామా ! దేవ దేవుడు అయిన బ్రహ్మ వెళ్ళిన తరువాత ( భగీరథుడు) వేళ్ళ మీద నిలబడి ఒక సంవత్సరము ఉపాసన చేసెను.

బాలకాండ
నలుబది మూడవ సర్గము
( గంగావతరణము )

విశ్వామిత్రుడు గంగావతరణము గురించి మరల చెప్పసాగెను.

'ఓ రామా ! దేవ దేవుడు అయిన బ్రహ్మ వెళ్ళిన తరువాత ( భగీరథుడు) వేళ్ళ మీద నిలబడి ఒక సంవత్సరము ఉపాసన చేసెను. శత్రువులను జయించగల ఆ భరద్వాజుడు బాహువులను పైకి ఎత్తి, ఆశ్రయము లేకుండా, వాయువునే ఆహారముగా చేసికొని కదలకుండాఉండెను.
అప్పుడు ఒక సంవత్సరము గడిచిన పిమ్మట అన్ని లోకములచే నమస్కరించబడు పశుపతి అగు ఉమాపతి భగీరథుని తపస్సుకి మెచ్చి ఇట్లు పలికెను. " ఓ నరశ్రేష్ఠా ! నీ కోరికను తీర్చెదను. నేను ఆ శైలరాజ సుతయగు గంగను నా శిరస్సుపై ధరించెదను"

' అప్పుడు హిమవంతుని జ్యేష్ఠ కుమార్తె అన్ని లోకములలో నమస్కరింపబడు ఆ గంగ మహా వేగముతో ఆకాశమునుండి శివుని సిరస్సు పై బడెను. ధరింపశక్యముగాని గంగ గర్వముతో తన ప్రవాహముతో శంకరుని కూడా తీసుకొని పాతాళము వెళ్ళెదను అని అనుకొనెను.
భగవాన్ శంకరుడు గంగయొక్క గర్వము తెలిసికొని క్రుద్దుడు అయ్యెను. ఆ మూడు కన్నులవాడు ఆమె గర్వము అణుచుటకు సంకల్పించెను. ఓ రామా ! శివుని శిరస్సు హిమవత్పర్వతములతో సమానమైన జటామండల గుహలతో ఉండెను. ఆ పుణ్యమైన గంగ ఆ జటామండలములో పడెను. ఆ గంగ భూమిపై వెళ్ళుటకు ఎంత ప్రయత్నించిననూ వెళ్ళలేక పోయెను. ఆ జటామండలములలో చిక్కుకొని బయటికి రాలేక పోయెను.
ఆ దేవి అచటనే చాలా సంవత్సరములు తిరుగాడుచుండెను. అది చూచి భగిఅథుడు మరల తపస్సు చేయసాగెను'.

' ఓ రఘునందన ! ఆ తపస్సుచే మిక్కిలి సంతుతుష్ఠుడై అప్పుడు మహదేవుడు ఆ గంగను బిందుసరస్సులో వదిలెను. ఆ విధముగా విడువబడిన గంగ సప్త నదులుగా సాగెను. హ్లాదినీ పావనీ నళినీ అనబడు శుభమైన గంగ జలములు తూర్పు దిశగా ప్రవహించెను. సుచక్షుః , సీతా , సింధు అనబడు మూడు నదులు పశ్చిమ దిశగా ప్రవహించెను. అప్పుడు ఏడవ నది భగీరథుని అనుసరించెను. రాజర్షి అగు భగీరథుడు ఒక రథముపై ఉండెను. ఆ మహాతేజోవంతుడు ముందుండగా గంగానది ఆయనను అనుసరించెను'.

'ఆకాశమునుండి శివుని శిరస్సు పై , పిమ్మట ఆ శిరస్సునుంచి భూమిపై తీవ్రమైన శబ్దము చేయుచూ గంగ ప్రవహించెను. అట్లు పడిన గంగ మత్స్యములతో తాబేళ్లతో ముసళ్ళతో ఇతర జంతువులతో భూమికి శోభ కూర్చెను. అప్పుడు దేవ ఋషి గంధర్వ యక్ష సిద్ధ సముహములు నగరాకారము లో నున్న విమానముల పై అశ్వములపై, దిగ్గజములపై వున్న దేవులందరూ ఆకాశమునుండి వెళ్ళిన గంగను ఆశ్చర్యముతో చూచిర".

' అ అద్భుతమైన పుణ్యకరమైన ఆ గంగాఅవతరనము చూచుటకు దేవ గణములందరూ అచటకు చేరిరి. ఆ సురగణముల ఆభరణ కాంతులతో దేదీప్యమానముగా ఆకాశము వెలుగుచుండెను. మేఘములుతొలగిన ఆకాశములో వందలకొలదీ సూర్యులతో నున్నట్లు ఆ ఆకాశము శోభిల్లుచుండెను. కదులుచున్న మత్స్యములతో , మొసళ్ళతో ఆ ఆకాశము విద్యుత్కాంతులతో వెలుగుచున్నటుల ఉండెను. పైకి లేచిన తెల్లటి నీటి నురుగులతో ఆకాశము హంసల గుంపులతోనూ శరత్కాలపు మేఘములతోనూ ఉన్నట్లు ఉండెను'.

' భగీరథుని వెనక వెళ్ళుతున్న గంగ కొన్ని ప్రదేశములందు ఉధృతముగనూ కొన్ని ప్రదేశములలో వక్రముగను , కొన్నిప్రదేశములలో విస్తారముగనూ , కొన్ని ప్రదేశములలో మెల్లిగా మెల్లిగా సాగిపోవుచుండెను. గంగ నీటి కెరటములు ఒకదానిపై ఒకటి పడిమరల పైకి లేచి మరల భూమిపై పడుచుండెను. శంకరుని తలపై తరువాత భూమిపై పడిన ఆ జలము కల్మషము లేకుండా నిర్మలముగా ప్రకాశించుచుండెను. శివుని శిరస్సు నుంచి పడిన జలము పవిత్రమని తలచి దేవతలూ గంధర్వులో వసుధాతుల వాసులందరూ ఆ జలముతో ఆచమనము చేసిరి. శాపవసాత్తు గగనమునుండి వసుధపైకి వచ్చిన వారందరూ ఆ నీటిలో అభిషేకము చేసి కల్మషములేని వారు అయిరి. ఆ నీటితో వెలుగొందుచూ పాపరహితులై మరల ఆకాశములో ప్రవేశించి తమ తమ లోకములకి పోయిరి. గంగలో స్నానము చేసి అలసటపోయినవారై ఆ నీటితో వెలుగొందుచూ లోకులందరూ సంతోషపడిరి.

' ఓ రామా మహాతేజోవంతుడు రాజర్షి అగు భగీరథుడు రథము ఎక్కిముందుగా పోవుచుండెను. గంగ ఆయన వెనుక వెళ్ళెను. దేవతలూ ఋషిగణములూ దైత్య దానవ రాక్షస గంధర్వయక్ష ప్రవర కిన్నరులతో సహా మహా నాగులూ అప్సరసలు ఇంకా జలచరములు అన్నియూ అందరూ సంతోషపడి భగీరథుని రథమును అనుసరించిరి. నదులలో శేష్ఠమైన, పాపమును నాశమొనర్చు ఆ గంగ ఎక్కడ రాజా భగీరథుడు వెళ్ళెనో అచటికి ఆ గంగ వెళ్ళెను .

' అప్పుడు గంగ అసాధారణమైన కర్మలు చేయగల మహాత్ముడైన జహ్ను ఋషి యొక్క యజ్ఞవాటికను ముంచివేసెను. ఓ రామా ! గంగయొక్క అహంకారమును చూచి క్రుద్ధుడై ఆ గంగలోనున్న జలమంతయూ అద్భుతముగా తాగివేసెను. అప్పుడు దేవతలు గంధర్వులు ఋషులు కూడా ఆశ్చర్య పడి పురుషులలో ఉత్తమముడైన జహ్ను మహర్షిని పూజించిరి. గంగను ఆ మహాత్మునకు కుమార్తెగ చేసిరి. అప్పుడు సంతసించిన ఆ మహాత్ముడు మరల ఆ జలములను తన చెవులద్వారా విడిచెను. గంగ జహ్ను సుత అవుట వలన జాహ్నవీ అని అన బడడమైనది'.

' అప్పుడు మరల గంగ భగీరథును అనుసరించి వెళ్ళెను. నదులలో శ్రేష్ఠమైన ఆ నది సాగరమును కూడా చేరెను.అప్పుడు భగీరథుని కార్యసిద్దికై పాతాళము కూడా ప్రవేశించెను. ఘోర ప్రయత్నముతో గంగానదిని తీసుకువచ్చిన అ రాజర్షి భగీరథుడు కూడా భస్మము చేయబడిన పితామహుల ను చూచి దీనమైనమనస్సు కలవాడాయెను. ఆ భస్మరాసిని పవిత్రమైన గంగాజలములు ముంచివేసెను. అప్పుడు ఓ రఘురామా ! పాపరహితులై వారు అందరూ సర్గమును పొందిర".

|| ఈ విధముగా వాల్మీకి రామాయణము లోని బాలకాండలోని నలభైమూడవ సర్గ సమాప్తము ||

|| ఓమ్ తత్ సత్ ||

అథ తద్భస్మనాం రాశిం గంగాసలిలముత్తమమ్ |
ప్లావయద్దూత పాప్మానః స్వర్గం ప్రాప్తా రఘూత్తమ ||

తా||ఆ భస్మరాసిని పవిత్రమైన గంగాజలములు ముంచివేసెను. అప్పుడు ఓ రఘురామా ! పాపరహితులై వారు అందరూ సర్గమును పొందిరి.

|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||